రికార్డులు తిరగరాసిన ఉనద్కత్..

129

ఐపీఎల్ వేలంలో కొద్దిసేపటి క్రితం పెను సంచలనమే నమోదైంది. సౌరాష్ట్ర రీజియన్ కు చెందిన ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ బేస్ ప్రైస్ రూ. 1.50 కోట్లు కాగా, అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ పోటీ పడ్డాయి. చూస్తుండగానే ఉనద్కత్ ధర కనీస ధరకు 10 రెట్లు పెరిగిపోయింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఉనద్కత్ ను రూ. 11.50 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుత వేలంలో బెన్ స్టోక్స్ (రూ. 12.50) తరువాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనద్కత్ నిలిచాడు.

RR Shell 11.5 Cr for Jaydev Unadkat

గతేడాది ఐపీఎల్‌లో పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఉనద్కట్.. 12 మ్యాచుల్లో 24 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ఈ ఏడాది అతనికి మంచి డిమాండ్ ఉంటుందని ముందే ఊహించారు. గతేడాది హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. ఇక మిగతా క్యాప్‌డ్ పేస్ బౌలర్ల విషయానికి వస్తే సందీప్ శర్మను రూ.3 కోట్లకు సన్‌రైజర్స్, హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు బెంగళూరు, శార్దూల్ ఠాకూర్‌ను రూ.2.6 కోట్లకు చెన్నై టీమ్ సొంతం చేసుకున్నాయి. ఇక రైట్ టు మ్యాచ్ కింద రూ.2.4 కోట్లకు మోహిత్ శర్మను దక్కించుకుంది కింగ్స్ పంజాబ్. ఆస్ట్రేలియా బౌలర్ నేథన్ కూల్టర్‌నైల్‌ను రూ.2.2 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.2 కోట్ల పెట్టి ఆర్సీబీయే కొనడం విశేషం.