మార్చిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

219
Election comission of india
- Advertisement -

త్వరలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో నిమగ్నమయ్యారు ఎన్నికల అధికారులు. మార్చి 7వ తేదీ నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. జూన్ 3వ తేది కల్లా 16వ లోక్ సభ పదవీ కాలం ముగియనుండటంతో షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్దమయ్యింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలతో పాటు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో లోక్ సభ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటుదని ఈసీ అభిప్రాయపడుతోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు 22.3లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరపడతాయని ఈసీ తెలిపింది.

ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల్లో పరిస్ధితులు ఎలా ఉన్నాయో.. ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉందోలేదో అనే విషయాలు పరిశీలించడానికి ఎన్నికల సంఘం అధికారులు అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు కూడా పూర్తి చేశారు. ఈ నెల 28 లోగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణలో ఏప్రిల్ 17వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -