సంపత్ నంది నిర్మాణ సారథ్యం లో ఆయన స్క్రిప్ట్ తోనే చిత్రీకరించబడిన పేపర్ బాయ్ నేడే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా జయశంకర్ దర్శకత్వం లో తెరకెక్కింది. సంపత్ అందించిన మాటలు, సన్నివేశాలు బాగానే ఉన్నా కథలో కొత్తదనాన్ని మాత్రం చూపించలేకపోయారు. కథలో ఓ మలుపు అనేది ఏమాత్రం కనిపించదు. బి.టెక్ పూర్తి చేసుకున్న రవి ( సంతోష్ శోభన్ ) ఉద్యోగం కోసం వెతుకుతూనే పేపర్ బాయ్ గా పనిచేస్తుంటాడు. తాను పేపర్ వేసే ఓ పేద ఇంట్లో ఉండే ధరణి ( రియా సుమన్ ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. రవి ప్రవర్తన ఆలోచనలు నచ్చి ధరణి కూడా ప్రేమిస్తుంది. అయితే వీళ్లిద్దరికీ ఉన్న అంతస్థు అనే భేదం వారి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. దాంతో రవి ధరణికి దూరమవ్వాలని నిశ్చయించుకుంటాడు. కానీ ధరణి రవిని వదులుకోలేకపోతుంది. వీళ్లిద్దరు చివరికి కలిసారా లేదా అనేదే కథాంశం.
ఈ స్టోరీ తరతరాలుగా వస్తున్నప్పటికీ ఒకింత ఫీల్ ని కలిగించేలా తెరకెక్కించారు జయశంకర్. కానీ కథ పూర్తిగా అదే కోణం లో సాగడంతో చూసే ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. దర్శకుడు ఓ మాదిరిగా కష్టపడినప్పటికీ, చిత్రం ఆకట్టుకునేలా మాత్రం లేదనే చెప్పాలి. భీమ్స్ సంగీతం బాగానే ఉంది. రెండు పాటలు వినడానికి ఆహ్లాదంగా అనిపిస్తాయి. సుందర్ రాజన్ కెమెరా వర్క్ బావుంది. నటన విషయానికి వస్తే సంతోష్ శోభన్ తన పాత్రకు న్యాయం చేసాడు. రియా సుమన్ కొన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. కథాబలం లేకపోవడం, రెండో భాగం లో కథ కొంత దారి తప్పడం ఈ చిత్రానికి లోపాలు.
నటీనటులు: సంతోష్ శోభన్ – రియా సుమన్
సంగీతం: భీమ్స్
నిర్మాత: సంపత్ నంది
దర్శకత్వం: జయశంకర్.
రేటింగ్: 2.5 /5