మూడోసారి సీఎంగా పన్నీర్ సెల్వం..!

208
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యతను డిప్యూటీ సీఎంకు అప్పగించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు జయ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలోనే శుక్రవారం సాయంత్రం కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది.ఇప్పటివరకు తమిళనాడుకు డిప్యూటీ సీఎం లేనందున కొత్తగా పదవి ఏర్పాటుచేసేలా మంత్రులు..  చర్చలు జరుపుతున్నారు.

జయలలితకు నమ్మిన శిష్యుడు పన్నీర్‌ సెల్వానికి గతంలో రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.దీంతో మరోసారి పన్నీర్ పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. గడిచిన 15 రోజులుగా సీఎం జయలలిత ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పరిపాలనా పరమైన ఆదేశాల జారీలో ఆలస్యం నెలకొంటున్నది. జయకు అత్యంత ఆప్తుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

selvam

అయితే రాజ్యాంగ పరంగా ఆయన పాత్రకు కొన్ని పరిమితులుంటాయి. జయ పదవిలోనే ఉన్నందున ‘తాత్కాలిక సీఎం’ అంశానికే తావులేదు. దీంతో పూర్తిస్థాయిలో పరిపాలన గాడిలో పెట్టేందుకుగానూ డిప్యూటీ సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు కేబినెట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

tamil nadu

2001లో జయ జైలుకు వెళ్లిన పరిస్థితుల్లో తొలిసారి పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో రెండోసారి సీఎంగా పన్నీర్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా జయ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావటంతో మూడోసారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -