తమిళనాడు సంక్షోభానికి తెరపడింది. పది రోజులుగా నడుస్తున్న డైలీ సిరీయల్ డ్రామాకు ముగింపు పలుకుతు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకున్నారు. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో శశికళ వర్గానికి చెందిన నాయకుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శశికళ జైలుకెళ్లడంతో నిరాశలో మునిగిపోయిన నేతలకు గవర్నర్ నిర్ణయం ఆనందాన్నిస్తోంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష ఖరారు కావటంతో వెంటనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన చిన్నమ్మ ….తన రాజకీయ చతురతకు పదును పెడుతు పార్టీకి ద్రోహం చేసిన పన్నీరుసెల్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదని.. తన మనిషే సీఎం కావాలని శశికళ పట్టుబట్టారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చర్యలు తీసుకున్నారు.
పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అంశంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఎమ్మెల్యేలు తనపైపునకు వస్తారని భావించిన పన్నీరు సెల్వంకు నిరాశ ఎదురైంది. బల నిరూపణకు అవకాశం వస్తే ఎమ్మెల్యేలు తనకే మద్దతిస్తారని పన్నీర్ సెల్వం చెప్పినప్పటికీ ఎంతమంది కలిసి వస్తారన్నది ఆయనకే క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ ఆచితూచి వ్యవహరించారు.
తన వర్గానికి చెందిన వారికి ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావటంతో శశికళ జైలు నుంచే పార్టీని నడిపే అవకాశాలున్నాయి. కటకటాల వెనక్కు వెళ్లినా పన్నీర్‌తో పోరు మాత్రం ఆగబోదంటూ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఆమె అంతకుముందు స్పష్టం చేశారు. అన్నాడీఎంకేను కాపాడుకోవడానికి కారాగారం గోడల మధ్య నుంచి కూడా మిమ్ములను నడిపిస్తానంటూ తన నివాసంలో కార్యకర్తల వద్ద ప్రకటించారు.
మరోవైపు జయ బహిష్కరించిన తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్, మేనల్లుడు వెంకటేశన్‌లను రంగంలోకి దించారు. దినకరన్‌కు పార్టీ డిప్యూటీ చీఫ్ పదవిని సైతం కట్టబెట్టడంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను జైలుకెళ్లినా ఇక్కడి వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరిగిపోవాలని, అందుకు తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉండటమే సరైన మార్గంగా ఆమె భావించినట్లు స్పష్టమవుతోంది. దీని ద్వారా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన ఆజ్ఞల మేరకు మాత్రమే జరగాలనే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.