పాకిస్తాన్ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికా- పాక్ మ్యాచ్ ఫలితం తేలకుండా వరుణుడు మరోసారి అడ్డు తగిలాడు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్‌ను విజేతగా అంపైర్లు ప్రకటించారు. భారత్ చేతిలో ఘోర పరాభవంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఆరంభించిన పాకిస్థాన్‌కు ఈ టోర్నీలో తొలి విజయం లభించింది.
భారత్‌పై పేలవ ప్రదర్శన చేసిన బౌలర్లు.. బుధవారం సత్తా చాటి దక్షిణాఫ్రికాను 219/8కు కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి పాక్.. 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అప్పటికి పాకిస్థాన్ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో 19 పరుగుల (డ/లూ ప్రకారం..) తేడాతో విజేతగా నిలిచింది. అప్పటికి బాబర్ అజామ్ (31 బ్యాటింగ్), షోయబ్ మాలిక్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు అజహర్ అలీ (9), జమాన్ (31)లతో పాటు మహ్మద్ హఫీజ్ (26) కూడా ఔటయ్యాడు. ఈ ముగ్గురినీ మోర్ని మోర్కెలే ఔట్ చేశాడు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించి ఛేదనలో పాక్‌కు శుభారంభం అందించిన ఓపెనర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చిన మోర్కెల్.. తర్వాత అజామ్‌తో మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తెచ్చిన హఫీజ్‌ను కూడా ఔట్ చేశాడు.
పాక్ బౌలర్ల అద్భుత ప్రదర్శన..
అంతకుముందు పాక్ బౌలర్ల ధాటికి విలవిలలాడిన దక్షిణాఫ్రికా.. 219 పరుగులు చేయడమూ గొప్ప విషయమే. హసన్ అలీ (3/24), ఇమాద్ వసీమ్ ((2/20), జునైద్ ఖాన్ (2/53)ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. డికాక్ 33 పరుగులు చేయగా.. ఆమ్లా (16), డివిలియర్స్ (0), డుమిని (8) విఫలమయ్యారు. డుప్లెసిస్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఐతే దక్షిణాఫ్రికా 150 పరుగులైనా చేస్తుందా అనుకున్న దశలో డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 104 బంతుల్లో 1×4, 3×6) గొప్పగా పోరాడాడు. మోరిస్ (28), రబాడ (26)లతో కలిసి దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు.
దక్షిణాఫ్రికా: 219/8 (డికాక్ 33, డుప్లెసిస్ 26, మిల్లర్ 75 నాటౌట్, మోరిస్ 28, రబాడ 26; జునైద్ ఖాన్ 2/53, ఇమాద్ వసీమ్ 2/20, హసన్ అలీ 3/24);
పాకిస్థాన్: 27 ఓవర్లలో 119/3