‘పాగల్’ రివ్యూ..

231
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ నటించిన కొత్త సినిమా ‘పాగల్’. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అగ్ర నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్పించ‌డం, విశ్వక్‌సేన్, నివేదా జోడీ న‌టించ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆస‌క్తి ఏర్పడింది. పాట‌లు, ప్రచార‌చిత్రాలు కూడా అల‌రించాయి. అంచనాలను ‘పాగల్’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

క‌థ: ప్రేమ్(విశ్వక్‌సేన్‌) చిన్నప్పుడే త‌న త‌ల్లిని కోల్పోతాడు. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మప్రేమ లాంటి అనుబంధం దొరుకుతుంద‌ని న‌మ్ముతాడు. అలా 1600 మంది అమ్మాయిల ముందు త‌న మ‌న‌సులో ప్రేమ‌ని బ‌య‌ట పెడ‌తాడు. కానీ, అత‌ని ప్రేమకి తిరస్కార‌మే ఎదుర‌వుతుంది. ఆ బాధ‌లోనే ఆత్మహ‌త్య చేసుకోవాల‌నే నిర్ణయానికొస్తాడు. ఇంతలో తీర (నివేదా పేతురాజ్‌) తనని ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. ఇంత‌కీ తీర ఎవ‌రు? నిజంగా ప్రేమ్‌ని ఆమె ప్రేమించిందా? వాళ్లిద్దరి క‌థ సుఖాంత‌మైందా? లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మైనస్‌ పాయింట్స్‌: క‌థ మొద‌లుకొని పాత్రల వ‌ర‌కు ఎందులోనూ స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. ఇందులో త‌ల్లీకొడుకుల బంధం నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో కానీ.. అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ప్రేమలో కానీ ఏమాత్రం భావోద్వేగాలు ప్రేక్షకుడి ఆకట్టుకోలేకపోయాయి. ద్వితీయార్ధంలో ప్రేమ్‌, తీర మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు మిన‌హా అంతా బ‌ల‌వంత‌పు వ్యవ‌హారంలా అనిపిస్తుంది. క‌థ కూడా ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతుంది. రెండు పాట‌లు, అక్కడ‌క్కడా కామెడీ మిన‌హా సినిమా పెద్దగా ప్రభావం చూపించ‌దు.

ప్లస్‌ పాంయిట్స్‌: విశ్వక్‌సేన్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్రేమికుడిగా హుషారైన పాత్రలో క‌నిపిస్తాడు. నివేదా పేతురాజ్ ద్వితీయార్ధంలోనే క‌నిపిస్తుంది. తీర పాత్రలో ఒదిగిపోయింది. మ‌హేష్‌, రాంప్రసాద్ త‌దిత‌ర కామెడీ బృందం కొన్ని స‌న్నివేశాల్లో నవ్వించింది. ఇందులో భూమిక ఆరంభ స‌న్నివేశాల‌కి ఆక‌ర్షణ‌గా నిలుస్తుంది.

సాంకేతిక వర్గం: సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు రధన్ తన మార్క్‌ చూపించాడు. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. కెమెరామన్ మణికందన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు అవసరమైన మేర నిర్మాణ విలువలున్నాయి. ఇక కొత్త దర్శకుడి నుంచి నుంచి ఆశించే భిన్నమైన కథనే నరేష్ కుప్పిలి ఎంచుకున్నాడు. ఆరంభంలోనే సినిమా పట్ల ఒక క్యూరియాసిటీని తీసుకురావడంలో అతను విజయవంతం అయ్యాడు. ప్రథమార్ధంలో కామెడీని బాగానే డీల్ చేశాడు. కానీ ఎంచుకున్న పాయింట్ ను ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు.

తీర్పు: పాగల్‌ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో.. ఎలా ముగించాలో తెలియని అయోమయంలో సినిమాను ట్రాక్ తప్పించేశాడు దర్శకుడు. ముందుకు సాగే కొద్దీ సినిమా గ్రాఫ్.. అలాగే దర్శకుడి పనితనం పడిపోతూ వెళ్లాయి. మొత్తంగా పాగల్ మధ్యలో దారి తప్పాడు.

చిత్రం: పాగల్‌
విడుదల తేదీ: 14-08-2021
రేటింగ్-2.25/5
నటీనటులు: విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్, సిమ్రన్‌ చౌదరీ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్‌
సంగీతం: రాధన్‌
దర్శకుడు: నరేశ్‌ కొప్పిలి

- Advertisement -