హైదరాబాద్ లోని జాతీయ సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులు మరోసారి ధ్వంసం చేశారు. ‘శరణం గచ్చామి’ విడుదలకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల ప్రతినిధులు సెన్సార్ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు. ఒక సినిమా కారణంగా సెన్సారు బోర్డు కార్యాలయం పలుమార్లు దాడులకు టార్గెట్ అవుతోంది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు దాడులకు గురైన విషయం తెలిసిందే.
అయితే రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఇది విడుదలకు ముందే వివాదాలకు కేంద్రంగా మారింది. కొందరు కావాలని ‘శరణం గచ్చామి’ విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ.. సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ సెన్సార్ బోర్డ్ ను ఆశ్రయించిన చిత్రయూనిట్, తమ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని కేవలం యువతను ఆలోచింపచేసే విధంగా ఈ సినిమాని తెరకెక్కించామని తెలిపారు.
అయితే పలు సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్ సీ సూచించగా అందుకు దర్శకుడు ప్రేమ్ రాజ్ నిరాకరించారని అందుకే ఈ చిత్రానికి సెన్సార్ నుంచి అనుమతి రావడం లేదని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకనే సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు.