కరోనా,లాక్ డౌన్‌తో సినీ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ధియేటర్లు మూత పడటం, షూటింగ్‌లకు బ్రేక్ రావడంతో సినీ రంగం భారీ నష్టాలను చవిచూసింది. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొచ్చాయి.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా ఇలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో మరో ఓటీటీ సంస్థ ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా “ఊర్వశి ఓటిటి” కార్యాలయం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో ప్రారంభమైంది.
విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోస్ తో ‘ఊర్వశి ఓటిటి’ తెలుగువారిని ఉర్రూతలూగించాలని విజయేంద్రప్రసాద్ ఆకాక్షించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందించడంతోపాటు… విడుదల పరంగానూ సపోర్ట్ చేయనుండడం “ఊర్వశి ఓటిటి” ప్రత్యేకత కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.