హీరో సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. తమిళంలో విజయవంతమైన ‘సివప్పు మంజల్ పచ్చై’ చిత్రానికి తెలుగు అనువాదమిది. ఈరోజు ఈమూవీ థియేటర్లలో విడుదలైంది. ఇందులో తమిళ నటుడు జి.వి.ప్రకాష్ మరో కథానాయకుడిగా నటించారు. ‘బిచ్చగాడు’దర్శకుడు శశి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆ అంచనాల్ని సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం..
కథ: బైక్ రేస్‌లంటూ అల్లరిగా తిరిగే ఆవేశపరుడైన కుర్రాడు మదన్(జీవీ ప్రకాశ్‌కుమార్). అక్క రాజ్యలక్ష్మి అలియాస్ రాజీ (లిజోమోల్ జోస్) అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో తానే అమ్మానాన్నై అక్కని ఎంతో జాగ్రతగా చూసుకుంటుంటాడు. అందుకే ఆమెకి కూడా తమ్ముడంటే అంతే ప్రేమ. రాజశేఖర్ అలియాస్ రాజ్ (సిద్ధార్థ్) నిజాయితీ గల దమ్మున్న ట్రాఫిక్ పోలీస్. రూల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. అలాంటి రాజ్‌కు మదన్ ఓ రోజు బైక్ రేసింగ్ చేస్తూ దొరికిపోతాడు. ఆ సమయంలో రాజ్ అతనికి ఆడవాళ్ల నైటీ వేసి అందరి ముందు అవమానిస్తాడు. అరెస్ట్ చేసి ఓరోజంతా జైల్లో వేస్తాడు. దీంతో రాజ్‌పై పగ పెంచుకుంటాడు మదన్. తనని అందరి ముందు అవమానించిన అతన్ని దెబ్బకు దెబ్బ తీయాలని కసిగా ఎదురు చూస్తుంటాడు. ఈలోపు ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. తనెవరి వల్లయితే అవమాన పడ్డాడో ఆ రాజే తన అక్కకి భర్తగా.. తనకి బావగా వస్తాడు. దీంతో అతనికి పుండు మీద కారం చల్లినట్లవుతుంది. తన మాట కాదని రాజ్‌ను పెళ్లి చేసుకున్నందుకు అక్కని కూడా దూరం పెడతాడు మదన్. రాజ్‌పై మరింత పగ పెంచుకుంటాడు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు మదన్ బైక్ దొంగతనం చేస్తారు. ఆ బండితో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ఆ కేసులో మదన్‌ని ఇరికిస్తారు. దీంతో బామ్మర్దిని కాపాడుకునేందుకు రాజశేఖర్ రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజ్ తన బామ్మర్దిని ఎలా కాపాడుకున్నాడు? అక్కని తమ్ముడిని కలపడానికి అతనేం చేశాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? మధ్యలో డ్రగ్ డీలర్ మధు (మధుసూధన్ రావు)కి రాజశేఖర్‌కి నడిచే పోరు ఏంటి? మదన్.. కవిన్ (కశ్మీరా)ల ప్రేమకథ ఏమైంది? అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్: రాజశేఖర్ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పాత్రకు తగ్గట్లుగా చాలా పరిణతితో నటించాడు. జి.వి.ప్రకాష్ తనదైన నటనతో మెప్పించాడు. ప్రకాష్ రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో భావోద్వేగభరిత సన్నివేశాల్లో హీరోయిన్ నటన మెప్పిస్తుంది. సిద్ధు కుమార్ స్వరాలు.. ప్రసన్న కుమార్ ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మైనస్ పాయింట్స్: స్టోరీ తెరకెక్కించిన తీరు మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో రాజ్.. మదన్‌ల మధ్య వచ్చే రేసింగ్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపినా..దర్శకుడు సినిమాని ముగించిన తీరు అంత సంతృప్తికరంగా అనిపించదు.
తీర్పు : ఒరేయ్ బామ్మర్దిలో బావ, బామ్మర్ది మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
చిత్రం: ఒరేయ్ బామ్మర్ది
విడుదల తేదీ: 13-08-2021
నటీనటులు: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్, లిజోమల్ జోస్, కశ్మీర
దర్శకుడు: శశి
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
సంగీతం: సిద్ధు కుమార్
రేటింగ్: 2.5/5