ఓటు చోరీ ఆరోపణలు, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు సోమవారం సుప్రీంకోర్టుకు పాదయాత్రగా వెళ్లనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే నేతలు.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు.
మరోవైపు, ఉదయం 11.30 గంటలకు రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత ప్రజల గొంతును అణచివేయడం వారివల్ల కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసుల చర్యలను ప్రస్తావిస్తూ.. విపక్ష నేతలు ప్రేమ, సోదరభావం, దేశభక్తితో సుప్రీంకోర్టుకు పాదయాత్రగా వెళ్తారని పేర్కొన్నారు.
ఈ పాదయాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, తాము చర్చించాలనుకున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని పేర్కొంటూ, రాహుల్ గాంధీ సమావేశ అభ్యర్థనను సీజేఐ గతంలో తిరస్కరించారు.
మరోవైపు, పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని ప్రజలకు సూచించారు.

