టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ మరోసారి సత్తా చాటింది. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇది రెండో అత్యధిక స్కోరు. ఇంగ్లండ్‌పై 2021లో చేసిన 232/6 పరుగులే పాకిస్థాన్‌కు అత్యధిక స్కోరుగా కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్ బ్యాటర్లు మాజ్ సదాకత్ (96), కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ (73) అద్భుతంగా రాణించారు. ప్రత్యర్థి ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వీరిద్దరూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వేగవంతమైన అర్ధసెంచరీలు సాధించారు. ఫర్హాన్ తన ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. 51 బంతుల్లో 96 పరుగులు చేసిన సదాకత్.. చివరి బంతికి క్యాచ్ ఇవ్వడంతో సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి.
అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి తడబడింది. ముఖ్యంగా యువ పేసర్ మహమ్మద్ ఇమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన రెండో టీ20 మ్యాచ్ ఆడుతున్న అతడు నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక ఎనిమిదో ఓవర్‌లోనే 49 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మహీశ్ తీక్షణ 26 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేయగా, చమిందు విక్రమసింఘే 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయినప్పటికీ శ్రీలంక 7 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది.
Also Read:‘బ్లడీ రోమియో’ కోసం స్టైలిష్ మేకోవర్
ఫీల్డింగ్ వైఫల్యాలే తమ ఓటమికి ప్రధాన కారణమని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ అంగీకరించాడు. బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. రావల్పిండిలో మంగళవారం జరిగే చివరి టీ20తో ఈ సిరీస్ ముగియనుంది. అనంతరం పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు వన్డే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొననున్నాయి.

