‘ఆపరేషన్ టైగర్’..ఎలా సక్సెస్ అయిందంటే?

6
- Advertisement -

తన ప్రత్యర్థి వర్గమైన శివసేన (UBT) కి కోలుకోలేని దెబ్బ తీసేందుకు శివసేన (షిండే వర్గం) వ్యూహం 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాతే సిద్ధమైంది. అయితే పార్లమెంట్‌లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు వీగిపోయిన తరుణంలో ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో ఈ ప్రణాళికను అమలు చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అలాగే కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండేలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఉద్ధవ్ వర్గం (Sena UBT) ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కూటమి బలాన్ని పెంచవచ్చని కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని వారు ఒప్పించగలిగారు.

మొదట శివసేన (UBT) కి చెందిన నలుగురు లోక్‌సభ ఎంపీలు…నాగేశ్ పాటిల్ అస్తికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, భావుసాహెబ్ వాక్‌చౌరేలను సంప్రదించగా సానుకూల స్పందన వచ్చింది. వీరికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ తో మంచి సంబంధాలు ఉండటం కలిసి వచ్చింది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు నుండి తప్పించుకోవడానికి కనీసం మూడింట రెండొంతుల మంది (2/3) ఎంపీలు అవసరం. ఉద్ధవ్ వర్గానికి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలు ఉండటంతో.. మరో ఇద్దరు ఎంపీలను కూడా తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ టైగర్’ సాగింది.

నిధుల కొరత మరియు పార్టీ నాయకత్వం (ఉద్ధవ్ ఠాక్రే) తమకు అందుబాటులో ఉండకపోవడం వల్ల కూడా ఈ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు షిండే వర్గం నేతలు తెలిపారు. కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్న సంజయ్ జాదవ్…ఈ ఏడాది ప్రారంభంలోనే రెండుసార్లు పార్టీ సమావేశాలకు హాజరుకాకుండా తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. ఏప్రిల్‌లో జరిగిన సమావేశానికి కూడా ఆయన రాకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహించి….జాదవ్ నియోజకవర్గమైన పర్భణీలోని ఆయన ముఖ్య అనుచరులను పార్టీ పదవుల నుండి తొలగించారు. ఆ తర్వాతే జాదవ్ ఇతర ఎంపీలను షిండే వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించారని సమాచారం.

ఓమ్రాజే నింబాల్కర్ (ధారాశివ్ ఎంపీ)…ఈయనను ఒప్పించడం మొదట్లో చాలా కష్టమైంది. అయితే 2019-2022 మధ్య కాలంలో మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో షిండే పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నింబాల్కర్‌తో కలిసి పనిచేశారు. షిండే ఎన్‌డీఏలో చేరినప్పుడు వీరి బంధం తెగిపోయినా పాత పరిచయాలతో చివరకు నింబాల్కర్‌ను షిండే ఒప్పించగలిగారు.

సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ)….మాజీ కాంగ్రెస్ నాయకుడైన ఈయన కూడా పార్టీ మారడానికి మొదట వెనుకాడారు. కానీ ఇటీవల ఆయన భార్య పల్లవి ప్రమాదానికి గురైనప్పుడు ఉద్ధవ్ వర్గం నుండి ఎవరూ పరామర్శించలేదు. అయితే ఏకనాథ్ షిండే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆ తర్వాత జరిగిన చర్చల అనంతరం పాటిల్ లొంగిపోయారు. ఆయన కుమార్తె రజూల్ (ఉద్ధవ్ వర్గం కార్పొరేటర్) కు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు కానీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Also Read:Stock crash:ఐటీ షేర్లు..ఢమాల్

మంగళవారం రాత్రి షిండే మరియు శ్రీకాంత్ తుది విడత చర్చలు ముగిసిన తర్వాత ఎంపిక చేసిన ఎంపీలను వివిధ ప్రాంతాల నుండి ప్రైవేట్ విమానాల్లో ఢిల్లీకి తరలించారు. కూటమిలో షిండే తన బలాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించి కొందరు బీజేపీ నేతలు ఈ ‘ఆపరేషన్ టైగర్’ పై నిఘా ఉంచినప్పటికీ.. హైకమాండ్ (బీజేపీ అధిష్టానం) ఆదేశాల మేరకు వారు కూడా ఈ ప్రణాళికకు పూర్తిగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.

- Advertisement -