ఉల్లి ధర రోజురోజుకు పెరుగుతూపోతుంది. ప్రస్తుతం ఉల్లి కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.100 వరకు అమ్ముడవుతుండడంతో వినియోగదారులు గిలగిల్లాడిపోతున్నారు.
మహారాష్ట్ర ఉల్లిపాయల సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఇవి లభించినా మరో రూ.10 నుంచి రూ.20లు అదనంగా పలుకుతున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో వ్రతాల కారణంగా కూరగాయల వినియోగం భారీగా పెరిగినా, ఉల్లి వినియోగం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనూ ధర ఆకాశయానం చేస్తుండడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉత్తరభారత దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 48 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తారు. ఈ ఒక్క జిల్లాలోనే 6.5 –7 లక్షల టన్నుల ఉల్లి పండుతుంది.
ఈ ఏడాది వరదల ప్రభావంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా వరదల దెబ్బకు ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గడం, ఎగుమతులు కొనసాగడంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి.