శ్రీనగర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడంపై మిత్రపక్షమైన కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ 1937లో ఆమోదించిన తీర్మానం ప్రకారం వందేమాతరం గీతంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని, దానినే కూటమి భాగస్వాములు కూడా అనుసరించాలని కాంగ్రెస్ చేసిన సూచనను నేషనల్ కాన్ఫరెన్స్ (NC) తోసిపుచ్చింది.
ఈ వివాదంపై ఒమర్ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ.. చట్టపరమైన నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని స్పష్టం చేశారు. జాతీయ గేయం (వందేమాతరం)కి సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి వర్షన్‌ను ఆలపించడం ఇప్పుడు తప్పనిసరి. ఇది కేవలం జమ్మూ కాశ్మీర్‌కే కాదు, దేశం మొత్తానికి వర్తిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని ఒమర్ చెప్పారు.
ఈ విషయంలో కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ.. ఈ అంశంపై కాశ్మీరీ ప్రజలు జైలుకు వెళ్లాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని విరుచుకుపడ్డారు. ఇండియా (INDIA) కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తోంది. ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “ఒక పార్టీగా మేము ఎప్పుడూ వందేమాతరాన్ని స్వీకరించలేదు, భవిష్యత్తులోనూ స్వీకరించము. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చక తప్పదు” అని వివరించారు. ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో కూడా జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని పూర్తిగా ప్లే చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 7న శ్రీనగర్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో వందేమాతరం గేయం పూర్తిస్థాయిలో (6 చరణాలు) ప్లే చేసినప్పుడు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా లేచి నిలబడి గౌరవం తెలిపారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, పూర్తి వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర సమరయోధులు కలలు కనిన సమగ్రత్వ విధానానికి పూర్తి అనుకూలంగా ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన 2 చరణాల వర్షన్‌నే మిత్రపక్షాలు కూడా పాటించాలని కోరారు.
Also Read:KTR:కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అధికారిక వేడుకల్లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం పూర్తి 6 చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది.

