గిట్టుబాటు ధర ఇస్తాం..

384
CM KCR at Pragathi Bhavan
- Advertisement -

వచ్చే ఏడాది, ఏడాదిన్నర సమయంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గిట్టుబాటు ధర సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని, రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో పామాయిల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైన నేపధ్యంలో పామాయిల్ రైతులు,మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం ప్రగతి భవన్‌కి వచ్చి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. ప్లాంటు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్లాంటును ప్రారంభిస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

CM KCR at Pragathi Bhavan

ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు… “ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం. కొంత మంది రైతులు అటోమెటిక్ స్టార్టర్లు ఉపయోగిస్తున్నారు. అవసరానికి మించి నీటిని తోడుతున్నారు. దీనివల్ల రెండు రకాల నష్టాలున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, అవసరానికి మించి నీరు అందడం వల్ల పంట పాడవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ స్టార్టర్ల వాడకం పూర్తిగా మానేయండి. వచ్చే ఏడాది, ఏడాదిన్నర సమయంలో మనకు మరింత కరెంటు లభ్యమవుతుంది. అప్పుడు వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.

“తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంది. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. సాగునీరు లేక పొలాలు బీళ్లుగా మారాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించుకుంటున్నాం. 9 గంటల కరెంటు ఇచ్చుకుంటున్నాం. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూశాం. 21.5 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించుకున్నాం. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నాం” అని సిఎం కేసీఆర్ వెల్లడించారు.

CM KCR at Pragathi Bhavan

“ఇక రైతులకు రెండే సమస్యలున్నాయి. పెట్టుబడి వ్యయం ఒకటైతే, గిట్టుబాటు ధర రాకపోవడం మరోటి. పెట్టుబడి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వమే ఏడాదికి ఎకరానికి 8 వేల రూపాయలను పెట్టుబడిగా సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది. ఏ పంట వేసినా సరే పెట్టుబడి 8వేలు అందుతాయి. ఎన్ని వందల ఎకరాల ఆసామి అయినా పెట్టుబడి కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రోహిణి కార్తె వచ్చిందంటే చాలు అప్పుల కోసం తిప్పలు పడే దుస్థితి ఉంది. ఈ విషవలయం నుంచి రైతులను బయటపడేయడానికే పెట్టుబడి వ్యయం సమకూర్చాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో ఇక రైతులు పెట్టుబడి కోసం అప్పు చేసే దురవస్థకు దూరమైనట్లే. రైతు సంతోషంగా ఉంటాడు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని మనుగడ సాగించే కులవృత్తులు కూడా వర్ధిల్లుతాయి. రైతు గ్రహమైతే, చేతి వృత్తి పనివారంతా ఉపగ్రహాలుగా బతుకుతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి రైతుతోనే ప్రారంభం అవుతుంది’ అని సిఎం చెప్పారు.

“గిట్టుబాటు ధర మరో సమస్య. ఇది తరచూ ఏర్పడే సమస్య. ఈ సమస్యకు కూడా పరిష్కారం ఆలోచించినం. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తాం. పంటలకు దర నిర్ణయించే అధికారం రైతు సంఘూలకే ఉంటుంది. రైతు సంఘం మండల స్థాయిలో వ్యాపారులతో చర్చించి ధర నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే అమ్మకం జరగాలి. రాష్ట్ర రైతు సంఘానికి వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తాం. ఏం పంటకైతే రేటు తగ్గిందో, ఆ తగ్గిన రేటుకు సరిపడా ఈ నిధుల నుంచి ఖర్చు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందే విషయంలో చర్యలు తీసుకుంటాం. ఈ నిధి ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తాం. నీటి వనరు, ఉష్ణోగ్రత, గాలిమేగం, భూసారం తదితర అంశాల ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం పంటలు వేసుకోవాలి. ఫలితంగా మంచి దిగుబడి వస్తుంది. అందరూ ఒకే పంట వేసుకునే పద్దతి పోతుంది. అందరూ ఒకే పంట వేయడం వల్ల మార్కెట్లో రేటు పడిపోతున్నది. రైతే రైతుకు శత్రువు అవుతున్నాడు. క్రాప్ కాలనీల ద్వారా వేర్వేరు పంటలు వేసుకోవడం ద్వారా అందరికీ మంచి ధర వస్తుంది. రాష్ట్రం కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తుంది. మన అవసరాలకు పోను మిగతా పంటను వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

CM KCR at Pragathi Bhavan

‘ఇవాళ అసెంబ్లీలో భూసేకరణ చట్టం ఆమోదించారు. చాలా సంతోషం. భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరిగితే ప్రాజెక్టుల నిర్మాణం కూడా వేగమవుతుంది. భక్త రామదాసు ప్రాజెక్టును రికార్డు టైంలో కట్టుకున్నాం. సీతారామ ప్రాజెక్టును కూడా అలాగే కట్టుకుంటాం. దీంతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుంది. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకుని సాగునీరు అందించుకుంటాం. వ్యవసాయాన్ని బాగు చేసుకుంటాం. అటు పెట్టబడి భారం తొలగి, ఇటు గిట్టుబాటు ధర లభించి, మరోవైపు సాగునీరు అంది. వ్యవసాయం పండుగ అవుతుంది. పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి రాదు. పండించిన పంటకు ధర రాదనే బాధ ఉండదు. మార్కెట్ సమస్యలుండవు. రైతే రాజు అవుతాడు. ఆర్థికంగా బాగుంటూడు. అప్పులు ఇస్తామని బ్యాంకర్లు రైతుల చుట్టూ తిరిగే రోజులు వస్తాయి. పిల్లనిస్తే వ్యవసాయదారుడికే ఇవ్వాలనే పరిస్థితి వచ్చి తీరుతుంది. ఈ పరిస్థితిని నేను స్వప్నిస్తున్నాను. తప్పక సాకారమవుతుంది. తెలంగాణను స్వప్నించి సాకారం చేసినట్లే రైతును రాజును చేస్తామనే స్వప్నం కూడా నిజమయి తీరుతుంది’ అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పామాయిల్ ప్లాంట్‌..దమ్మపేట మండలం – అప్పారావుపేట గ్రామ -కొత్తగూడెం జిల్లా గంటకు 60 టన్నుల సామర్థ్యం.పని ప్రారంభం 18 ఏప్రిల్ 2016.ఉత్పత్తి ప్రారంభం 29 ఏప్రిల్ 2017. కేవలం ఏడాదిలోనే నిర్మాణం పూర్తి .

CM KCR at Pragathi Bhavan

వ్యయం 82 కోట్లు..ఎన్.సి.డి.సి. – 64 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం -10 కోట్లు – ఫెడరేషన్ 7.40 కోట్లు. మొదటి దశలో గంటకు 30 టన్నుల సామర్థ్యం. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల రైతులకు మేలు ప్రస్తుతం 26 మండలాల్లో 30 వేల ఎకరాల్లో సాగు ఆ అశ్వరావుపేట పామాయిల్ ప్లాంటు ఆధునీకరణ కొత్త మిషన్లు, కొత్త బాయిలర్లు వ్యయం -30 కోట్లు,అశ్వరావుపేట, అప్పారావుపేటకు కలిపి 100 కోట్ల ఖర్చు. గతంలో ప్రభుత్వం ఎన్నడూ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ రెండింటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం 13 కోట్లు ఇచ్చింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఎన్.సి.డి.సి. రుణం తెచ్చింది.4-5 వేలున్న టన్ను పామాయిల్ ధర 9 మేలకు చేరింది.పామాయిల్ రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రైతులు పామాయిల్ సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోనే పామాయిల్ ప్లాంట్లు నడవడం వల్ల మేలు.

- Advertisement -