బసవతారకంలో ఎన్టీఆర్ వర్దంతి..

136
nbk
- Advertisement -

తెలుగుదేశం పార్టీ స్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వ్యవస్థాపకులు అయిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 26 వ వర్థంతి వేడుకలను హాస్పిటల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI వారు సంస్థ ఆవరణలో ఉన్న స్వర్గీయ శ్రీ మరియు శ్రీమతి నందమూరి బసవతారకం రామారావు గార్ల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ తన భార్య స్వర్గీయ నందమూరి బసవతారకం గారు క్యాన్సర్ తో బాధపడి చనిపోయిన తర్వాత అలాంటి ఇబ్బందులు మరొకరికి ముఖ్యంగా పేదలకు ఎదురుకాకుండా చూడాలన్న సంకల్పంతో BIACH&RI స్థాపించారని తెలిపారు. నాటి నుండి నేటి వరకూ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను ఎందరో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం తో పాటూ ఉచితంగానూ వైద్యం అందించడంలో ముందంజలో ఉందని చెప్పారు. ముఖ్యంగా కరోనా కాలంలో కూడా క్యాన్సర్ రోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఎంతో ధైర్యంగా చికిత్స అందించారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ తండ్రి ఆశయాలకు తగినట్లుగా సంస్థను ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు.

ఇలా పేదలకు క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పడమే కాకుండా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి పేదల ఆకలి తీర్చడానికి ప్రత్యేకంగా రెండు రూపాయలకే బియ్యం అందించడంతో పాటూ రాయలసీమ క్షామం తీర్చడానికి తెలుగుగంగ లాంటి నీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పనే చేసిన మహానుభావుడని శ్రీ బాలకృష్ణ అన్నారు. అటువంటి మహనీయుని తనయునిగా ప్రజలకు తన వంతు సేవలను అందించడంలో వెనుకాడకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా మరో మారు ఓమిక్రాన్ పేరుతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ప్రభుత్వాలు సూచించిన మేర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు.

అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావుకు హాస్పిటల్ సిబ్బందితో కలసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణతో పాటూ డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ (యాడ్ లైఫ్ మరియు అకడమిక్స్), BIACH&RI; డా. సెంథిల్ రాజప్ప, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి, BIACH&RI; డా. వీరయ్య చౌదరి, రేడియాలజీ విభాగాధిపతి, BIACH&RI లతోపాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -