యాదాద్రికి భారీ విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ మల్లారెడ్డి..

23

యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం.. ఎన్ఆర్ఐ ఫైళ్ళ మల్లారెడ్డి ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో కలిసి మల్లారెడ్డి చెక్కును అందించారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ మహత్కార్యంలో భాగస్వామ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు, మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి ఈ సందర్భంగా మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ముందుకొస్తున్నారని, దేవాదాయ శాఖ తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

దాతృత్వం చాటుకుంటున్న పైళ్ళ మల్లారెడ్డి..

ఇదిలా ఉండగా, ఉన్న ఊరుని, కన్న తల్లి తండ్రులని మరచిపోతున్న తనయులు ఉన్న ఈ లోకంలో, నేనేంటి? నాకేంటి? అంటున్న జనం ఈ ప్రపంచంలో, ఉన్న ఊరు కన్న తల్లీ దండ్రులనే కాదు, తన రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో చేస్తున్నారు పైళ్ళ మల్లారెడ్డి. చేతికి ఎముక లేదన్నట్లుగా తనకు తోచిన సహాయం అందిస్తూ ధాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల నిధులు విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మిషన్ కాకతీయ పథకానికి 50 లక్షల రూపాయలు అందించి, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు.

సొంత ఊరు నల్గొండ జిల్లా సుంకిశాలలో కాలేజీ కట్టించి విద్యాదానం చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఆలయం కట్టించి ఆ వైకుంఠ ధామాన్ని నిలిపారు. ఇప్పుడు తాజాగా సీఎం కెసిఆర్ పిలుపు నందుకొని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం స్వర్ణ తాపడానికి కేజీ బంగారం విరాళంగా ఇచ్చారు. పెడుతూ ఉంటేనే కలుగుతుందంటారు. ఆ నానుడిని నిజం చేస్తూ, తన సంపాదనలో కొంత ఇతరులకు ఇస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పైళ్ల మల్లారెడ్డి. మల్లారెడ్డిని అటు సీఎం కెసిఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఇటు ఆయన గ్రామ, జిల్లా, రాష్ట్ర ప్రజలు కూడా అభినందిస్తున్నారు.