సార్వత్రిక ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో 17 లోక్ సభ స్థానాల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతోంది టీకాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో పోత్తులుండవని మహాకూటమి ప్రస్తావన ఉండదని ఇప్పటికే సంకేతాలిచ్చిన పీసీసీ నేతలు అందుకుతగ్గట్టుగానే పోటీచేసేందుకు ఆసక్తికనబర్చే వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆశావాహులు కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తికనబరుస్తుండగా మరికొన్నిచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఖమ్మం,భువనగిరితో పాటు మల్కాజ్‌గిరి,నాగర్‌కర్నూల్,మహబూబ్ నగర్ వంటి స్ధానాల కోసం పోటీ ఎక్కువగా ఉండగా నిజామాబాద్,వరంగల్ వంటి స్థానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ రెండు స్థానాల్లో స్థానికేతరులను బరిలో దింపే విధంగా హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఇక ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గ పరిధిలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో ఇక్కడినుండి బరిలో దిగేందుకు సీనియర్ నేతలు చాలామంది ఆసక్తికనబరుస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి,పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్,మాజీ ఎంపీ వి హనుమంతరావు,పొంగులేటి సుధాకర్ రేసులో ఉండగా ఈ జిల్లాకే చెందిన పారిశ్రామిక వేత్త వృద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. అధిష్టానం సీటు ఇచ్చిన ఇవ్వకున్న తాను బరిలో ఉండటం ఖాయమని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఇక నిజామాబాద్ విషయానికొస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడి నుండి సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆమె గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం టీఆర్ఎస్ సునామీకి కొట్టుకుపోయారు. దీంతో ఇక్కడి నుండి పోటీచేసేందుకు ఎవరు ఆసక్తికనబర్చడం లేదు.
ఇక్కడి నుండి రెండుసార్లు ఎంపీగా పోటీచేసిన మధుయాష్కి మళ్లీ బరిలో ఉంటారని ప్రచారం జరిగినా ఆయన పోటీకి విముఖత చూపిస్తున్నారు. భువనగిరి లేదా మరో పార్లమెంట్ స్ధానం నుండి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తుకుంటున్నారు. ఇప్పటివరకు ఇక్కడి నుండి పోటీచేసేందుకు నామమాత్రంగా ఒకే ఒక్కరు దరఖాస్తు చేసుకున్నారు.దీనిని బట్టిచూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇక బీజేపీ ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్‌ను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నా ఆయన పోటీ ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఎదురుచూస్తారోనన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.