ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల పరాభవం మరోవైపు పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ నేతలు,కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఏంచేయాలో పాలుపోని హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు వారం రోజులు కూడా లేదు అయినా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో అధికార టీఆర్ఎస్ కంటే వెనుకంజలోనే ఉన్నారు.
ప్రచార కమిటీలు వేసినా రాష్ట్ర నేతలు ఎవరు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడంతో స్ధానిక నేతల్లో అసహనం నెలకొంది. రాష్ట్ర ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేవలం తాను పోటీచేస్తున్న నియోజకవర్గానికే పరిమితం కావడం మరోమైనస్. ఇప్పటికే ఉత్తమ్‌పై కారాలు,మిరియాలు నూరుతున్న ఆ పార్టీ నేతలు పీసీసీ బాధ్యతల నుండి ఉత్తమ్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే నిజామాబాద్‌లో కారు స్పీడుకు హస్తం కుదేలైంది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ ఓటమిని ముందుగానే ఉహించి పెద్దగా ప్రచారం చేయడం కూడా చేయడం లేదు. పెద్దపల్లిలోనూ కాం గ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ బరిలో ఉన్నామా అంటే ఉన్నామనేరీతిలో ప్రచారం చేస్తున్నారే తప్ప పెద్ద సీరియస్ నెస్ కనబడటం లేదు.మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్,కరీంనగర్‌లో పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహిస్తున్నా స్థానికంగా ముఖ్యనేతలు టీఆర్ఎస్ కు వలసపోవడం మైనస్‌గా మారింది. హైదరాబాద్‌లో కాం గ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఉనికి చాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం తమ్ముడు రాజగోపాల్ రెడ్డి చెమటోడుస్తున్నారు. ఖమ్మం,మల్కాజ్ గిరి,చేవేళ్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో పర్వాలేదనిపిస్తున్నారు.
మెదక్ అభ్యర్థి గాలి అనిల్ ప్రచారం కోసం పార్టీ ప్రముఖులు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీనేతలే వాపోతున్నారు. పాలమూరులో వంశీచంద్‌రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్న పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. నేతలు సహకరించక నాగర్ కర్నూల్ లో మల్లురవి ప్రచారం అంతంతగానే సాగుతోంది.
మొత్తంగా సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే హస్తం నేతలు మాత్రం పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే కనీసం ప్రచారంలో కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.