ఎమ్మెల్సీగా నితీశ్ కుమార్ రాజీనామా

7
- Advertisement -

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యత్వం పొందిన నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు వేగంగా సాగుతున్నాయి.

నితీశ్ కుమార్ తన రాజీనామాను బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఆవధేశ్ నారాయణ్ సింగ్కు సమర్పించారు.మార్చి 16న రాజ్యసభకు ఎన్నికైన ఆయన, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండు సభల సభ్యత్వం కొనసాగించలేరు. అందువల్ల 14 రోజుల్లో ఒక పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఇక నితిన్ నవీన్ కూడా బిహార్‌లోని బంకిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.తన రాజీనామాను ప్రకటిస్తూ, పార్టీ కార్యకర్తలకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. 2006లో తన తండ్రి మరణం తరువాత పార్టీ ఇచ్చిన అవకాశంతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని గుర్తుచేశారు.

నితీశ్ కుమార్ కొత్త పాత్రలోకి వెళ్లనున్న నేపథ్యంలో, బిహార్‌లో తదుపరి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో, నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ ఇటీవలే జేడీయూలో చేరారు. ఆయనను కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

నితీశ్ కుమార్ రాజీనామాతో బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో సీఎం పీఠం ఎవరికీ దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -