దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ (E20) పెట్రోల్ వాడకంపై వాహనదారుల నుండి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సగటు కార్ల యజమానులు తమ వాహనాల మైలేజీని సొంతంగా ఖచ్చితంగా లెక్కించలేరని దీని కోసం డీలర్ల వద్ద ఉండే పరికరాలపైనే ఆధారపడాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానంపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్ట్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. తాను 2023లో కొనుగోలు చేసిన కారులో ప్రభుత్వం సూచించిన E20 పెట్రోల్ పోయించిన తర్వాత నగరంలో మైలేజీ గతంలో ఉన్న 11 కి.మీ నుండి ఏకంగా 7 కి.మీకి పడిపోయిందని పేర్కొన్నారు. దీనికి గడ్కరీ స్పందిస్తూ.. ఆ మైలేజీని ఎలా లెక్కించారని ప్రశ్నించారు. జర్నలిస్ట్ తన కారు డ్యాష్‌బోర్డ్‌లో కనిపించే రీడింగ్‌ను బట్టి చెప్పానని అనగా.. గడ్కరీ దానిని అంగీకరించలేదు.
మీరు కానీ, నేను కానీ మైలేజీని అలా సొంతంగా చెక్ చేయలేము. కారు యొక్క ఖచ్చితమైన మైలేజీని కేవలం కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ వద్ద ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా మాత్రమే లెక్కించడం సాధ్యమవుతుంది అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ 3% నుండి 5% వరకు తగ్గే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా ఒక నివేదికలో స్పష్టం చేసింది. అయితే కేవలం మైలేజీ ఒక్కటే కొలమానం కాదని.. కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులను తగ్గించడం వంటి కీలక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా E20 ఇంధన విక్రయాలను కేంద్రం తప్పనిసరి చేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పూర్తిగా కాకపోయినా దాదాపు ఖచ్చితమైన మైలేజీని వాహనదారులు సొంతంగా తెలుసుకోవచ్చు. ఆధునిక కార్లలో ఇంజన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాయంతో డ్యాష్‌బోర్డ్‌పై మైలేజీ చూపిస్తుంది. ఇది 95% వరకు ఖచ్చితత్వంతో ఉంటుంది. వాహన నిపుణులు కూడా అత్యంత విశ్వసనీయమైనదిగా భావించే పద్ధతి ఇది. ట్యాంక్ ఫుల్ చేయించి, ట్రిప్ మీటర్ రీసెట్ చేసి.. మళ్లీ పెట్రోల్ పోయించినప్పుడు ప్రయాణించిన దూరాన్ని, పట్టిన లీటర్లతో భాగిస్తే ఖచ్చితమైన రియల్-టైమ్ మైలేజీ తెలుస్తుంది.
Also Read:ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులు!
డీలర్ల వద్ద ఉండే కంప్యూటర్ పరికరాలు కేవలం కారు మైలేజీని మాత్రమే కాకుండా.. ఇంజన్ లోపాలు, ఆక్సిజన్ సెన్సార్లు, ఫ్యూయల్ ఇంజెక్టర్ల పనితీరును అంచనా వేస్తాయి. మంత్రి గడ్కరీ సాంకేతిక పరీక్షల ప్రాధాన్యతను సమర్థించినప్పటికీ, నిత్య జీవితంలో ట్రాఫిక్, ఏసీ వాడకం, డ్రైవింగ్ శైలి వంటి అంశాల ఆధారంగా వాహనదారులు చేసే సాధారణ మైలేజీ లెక్కలే రియల్-వరల్డ్ పనితీరును ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

