మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం సరికొత్త వైమానిక దాడులకు దిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించింది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ఇతర దేశాల నౌకల రక్షణ కోసం ప్రత్యేక రుసుము వసూలు చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
మరోవైపు అమెరికా దాడులకు ఇరాన్ సైతం గట్టిగానే బదులిచ్చింది. బహ్రెయిన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు చెందిన రెండు చమురు రవాణా నౌకలపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తోన్న ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే యూఏఈ నౌకలపై ఈ దాడులు జరిగాయి.
ఈ క్షిపణి దాడుల కారణంగా ఒక భారతీయ నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్ చర్యలపై యూఏఈ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడంతో దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ తాజా యుద్ధ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84 డాలర్లకు పైగా చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అన్ని దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: సైబర్ ముప్పుపై అప్రమత్తత అవసరం!

