పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదు!

3
- Advertisement -

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహన తయారీ సంస్థలకు (OEMs) మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల కాలం చెల్లిపోయిందని, భవిష్యత్తు అంతా ప్రత్యామ్నాయ ఇంధనాలదేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం జరిగిన ‘బస్‌వరల్డ్ 2026’ (Busworld 2026) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

చాలా స్పష్టంగా చెబుతున్నాను.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు. తయారీదారులు వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంజన్ లేదా హైడ్రోజన్ వంటి ఇంధన సాంకేతికతలకు మారాలి అని గడ్కరీ పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కాలుష్యం అని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు.

బస్సులు మరియు ఇతర ప్రజా రవాణా వాహనాలు పూర్తిగా విద్యుత్తు (Electric) లేదా గ్రీన్ హైడ్రోజన్‌తో నడవాలని, దీనికోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోని సంస్థలు మార్కెట్‌లో వెనుకబడిపోతాయని ఆయన హెచ్చరించారు. తక్కువ ఖర్చుతో కూడిన, స్వదేశీ ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని కోరారు.

Also Read:ఏపీ కేబినెట్ భేటీ..కొత్త పెన్షన్లపై చర్చ

గతంలో కూడా నితిన్ గడ్కరీ డీజిల్ వాహనాలపై అదనపు పన్ను (Pollution Tax) విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యలు ఆటో మొబైల్ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీశాయి. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వైపు ఎంత వేగంగా అడుగులు వేస్తోందో ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.

- Advertisement -