అద్భుత తెలంగాణ ఆవిష్కరణకే సిఎం కెసిఆర్ నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లహరి గార్డన్ లో ఎమ్మేల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన వానకాలం 2020, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నాగర్కర్నూల్ నియోజకవర్గస్థాయి రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్ర పటం లో అన్ని రకాల పంటలను పండించే ప్రాంతంగా తెలంగాణ ఉంటుందని అన్నారు. ఎగుమతుల దృష్టితోనే తెలంగాణ పంటలు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రాబోయే కాలంలో వానకాలం,యసంగిలలో రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు .
ఎప్పటిలాగే పంటలు సాగు చేయక వైవిధ్యమైన పంటలు వేయాలని, దానివల్ల అధిక దిగుబడులు రావడమే కాకుండా మంచి లాభాలు వస్తాయని అన్నారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో వేరుశెనగ నుండిమంచి వంగడాలు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .ఇక్కడ పండించే పంట విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.తెలంగాణ ఉత్పత్తులకు డిమాండ్ తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు. రైతులు మొక్కజొన్న పండించవద్దని,వరి లో సన్న రకాలు పండించాలి కోరారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలను 5 నుండి 10 లక్షల ఎకరాలలో పండించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ,రాబోయే కాలంలో నూనె పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అంతేకాక భవిష్యత్తు ఉంటుందని తెలిపారు .ఈవాన కాలంలో కోటి 60 లక్షల ఎకరాల వ్యవసాయ పంటలను సాగు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోపు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు.
మంత్రి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం జరగనివ్వమని, రైతుల కోసం విద్యుత్తు, పెట్టుబడి, రైతు బంధు రైతు, బీమా సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని అన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలని ఆయన కోరారు . వ్యవసాయాన్ని నూతన పద్ధతిలో సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలి విప్ దామోదర్ రెడ్డి,జెడ్పి చైర్ పర్సన్ పద్మావతి,ఎంపీ రాములు, జిల్లా రైతు బందు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, కలెక్టర్ శ్రీధర్, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు.పాల్గొన్నారు