యాసంగిలోనే మొక్కజొన్న సాగు: నిరంజన్ రెడ్డి

214
- Advertisement -

హైదరాబాద్ హాకా భవన్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో సమగ్ర వ్యవసాయ విధానం మీద సమీక్షించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరైయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగిలోనే మొక్కజొన్న సాగు చేయాలి. వానాకాలం కంది, పత్తిపంటలు ఎక్కువ సాగుచేయండి.. మొక్కజొన్న వద్దే వద్దు. పంటల సాగుపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు అని మంత్రి తెలిపారు.

10 లక్షల ఎకరాలలో తెలంగాణ సోనా సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ ఏ జిల్లాలలో ఏఏ రకాలు సాగుచేయాలో పంటల మ్యాప్‌లను అధికారులు సిద్దం చేస్తున్నారు. సర్కారు చెప్పిన పంటలే సాగుచేయాలి.పంట వేయడం దగ్గర నుండి పంటలు అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించండి. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి రైతు రావాలి అని మంత్రి కోరారు.

Niranjan Reddy Review On New Agriculture System

తెలంగాణ ఫలాలు దేశానికి అందించాలి. తెలంగాణ రైతు ఉన్నతస్థాయిలో ఉండాలి.ఇదే కేసీఆర్ ఆశయమన్నారు.వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నాం. ఆరేళ్లలో కరెంటు, సాగునీటి అవస్థలు తొలగించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రాధాన్యతతో కూడిన రంగం వ్యవసాయం ఉండాలి. అందుకే ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలని పట్టుబట్టి కార్యాచరణ మొదలుపెట్టారు. కనీస మద్దతుధర కాదు రైతులకు గిట్టుబాటు ధర కావాలి అని మంత్రి పేర్కొన్నారు.

కాగా రేపు బుధవారం 10 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం (mcrhrd)లో సమగ్ర వ్యవసాయ విధానంపై వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రైతుబంధు సమితి రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు, రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు,వ్యవసాయ నిపుణులు హాజరుకానున్నారు.

- Advertisement -