హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు యంగ్ హీరో నిఖిల్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘కార్తికేయ’… మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ హిట్టే. ఈ జైత్రయాత్ర ‘స్వామి రారా’ నుంచి మొదలైంది. నిఖిల్ సూపర్‌హిట్ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ. ‘స్వామి రారా’ తర్వాత నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘కేశవ’. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మంగళవారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్లు ఎంత కొత్తగా ఉన్నాయో… సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ రోజు డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించింది. మరో పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ‘స్వామి రారా’ తరహాలో ఈ ‘కేశవ’ కూడా టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేస్తుంది. నిఖిల్–సుధీర్‌వర్మ కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో మా సంస్థకున్న మంచి పేరు దృష్ట్యా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ‘ఏసియన్ ఫిల్మ్స్’ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు. మిగతా ఏరియాల నుంచి కూడా ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మే 12న విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ – ‘‘సుధీర్‌వర్మ, నేనూ మంచి స్నేహితులం. ‘స్వామి రారా’తో మా ఇద్దరి కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. ఆ సినిమా తరహాలో ‘కేశవ’ కూడా సూపర్ హిట్టవుతుంది. సుధీర్‌వర్మ టేకింగ్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నా క్యారెక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేశాడు’’ అన్నారు.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు.
రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్., సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ, నిర్మాత: అభిషేక్ నామా, సమర్పణ: దేవాన్ష్ నామా.