మోడీ హత్యకు భారీ స్కెచ్..!

238
NIA nabs three Al-Qaeda suspects
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 21 మంది నేతల హత్యకు అల్ ఖైదా సహకారంతో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఉగ్రవాదుల నాయకుడు హకీం పరారైనప్పటికీ, నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులు వలపన్ని వీరిని అరెస్ట్ చేశారు. అయితే వీరిలో చివరి క్షణాల్లో హకీం తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో అబ్బాస్ అలీ (27), అయూబ్ ఖాన్ (26), అబ్దుల్ కరీం (26) ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నలుగురిని తమిళనాడులోని మధురైలో వేర్వేరు చోట్ల దాడిచేసి పట్టుకున్నారు. మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నైలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే సులేమాన్ ఆధ్వర్యంలో ముగ్గరు ఉగ్రవాదులు ‘ది బేస్ మూవ్ మెంట్’ పేరుతో ముఠాగా ఏర్పడి పేలుళ్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణం, జూన్ 15న కేరళలోని కొల్లం కోర్టు ప్రాంగణం, ఆగస్టు 1న కర్ణాటకలోని మైసూర్ కోర్ట్ ప్రాంగణం, సెప్టెంబర్ 12న నెల్లూరు కోర్టు దగ్గర, ఈ నెల 1న కేరళ మళప్పురం కోర్టు ప్రాంగణంలో పేలుళ్లకు పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. మైసూర్ పేలుడు కేసును ఎన్ఐఏ హైదరాబాద్ బృందం దర్యాప్తు చేస్తోంది.

తెలంగాణ, తమిళనాడు పోలీసులతో కలసి ఎన్ఐఏ అధికారులు.. ఆదివారం రాత్రి నుంచి చెన్నై, మధురైల్లో దాడులు చేశారు. సులేమాన్ తో పాటు అబ్బాస్, కరీం, అయూబ్ లను అరెస్టు చేసి కోర్టుల్లో హాజరుపరిచారు. వీళ్లను విచారించేందుకు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్లు వేయనున్నారు. ఇదే ముఠాకు చెందిన హకీం, దావూద్ సులేమాన్ల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

- Advertisement -