ఆమె ఒక దేశానికి ప్రధాని..ఓ చంటిబిడ్డకు తల్లి. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో అంతకుమించి కరోనా కోరల్లో చిక్కుకుపోయిన తనదేశాన్ని కాపాడటానికి శాయశక్తులా పోరాడింది. కరోనాపై పోరులో తన దేశం పేరును ప్రపంచమంతా జపించేలా చేసి యావత్ ప్రజానీకం చేత శభాష్ అనిపించుకుంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా…. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్. అభ్యుదయవాదిగా, జనహృదయ నేతగా మన్ననలు అందుకుంటున్న జసిండా… ఆశమంతా ఎత్తుకు ఎదగింది.
జసిండా పూర్తి పేరు జసిండా కేట్ లారెల్ ఆర్డెన్. యూనివర్సిటీ ఆఫ్ వైకటో నుంచి పబ్లిక్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుండే రాజకీయాలపై ఆసక్తికనబర్చే జసిండా… పదిహేడేళ్లకే లేబర్ పార్టీలో చేరారు. తొలిసారి వైకటో ఎంపీ స్థానానికి పోటీ చేసి సుమారు 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటి అడుగులోనే ఓటమి. అయినా నిరాశ చెందలేదు. 28 ఏళ్ల వయసులో ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికై చిన్నవయస్కురాలైన ఎంపీగా గుర్తింపు సాధించారు.
ఎంపీగా అనేక సమస్యలపై గళమెత్తారు. ఆమెలోని పోరాటపటిమ,సమస్యలపై స్పందించే తీరుతో అనతికాలంలోనే లేబర్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. 2017లో ఎన్నికలకు ముందు లేబర్ పార్టీ నాయకుడు ఆండ్రూ లిటిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని తన వారసురాలిగా జసిండా పేరును ప్రతిపాదించారు.
ఓ వైపు లెబర్ పార్టీపై ప్రజల్లో ప్రతికూలత,అసహనం….ఎన్నో సవాళ్లు అయినప్పటికి వెనుదిరిగిచూడలేదు. తన మేదస్సుకు పదనుపెట్టి విద్యారంగంలో సంస్కరణలు, పేదరికం, మానసిక ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఎన్నికలో బరిలో దిగారు. జసిండా మానియాతో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేస్తూ పాలనలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి ప్రజల్లో చెరగని ముద్రవేశారు జెసిండా. పలు అంశాల మీద స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించడం ఆమె నైజం. టీవీ షో నిర్వాహకుడు క్లార్క్ గేహోర్డ్ను ప్రేమవివాహం చేసుకున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన జసిండా…. మూడు నెలల బిడ్డతో ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరై ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
కాళ్ల కింద భూమి కంపిస్తుంటే ఎలాంటి వారైనా ప్రాణభయంతో ఆరుబయటకి పరుగెత్తుతారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో భూకంపం రాగా ఆమె కాలుకూడా కదపలేదు. తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించిన ఆమె… పైగా పార్లమెంట్ భవనంలో భూమి కంపించింది చూశారా అంటూ మీడియా ప్రతినిధులతో చమత్కరించారు.
రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను రెండు నిమిషాల్లో చెప్పి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 92 వేల జాబ్ లు క్రియేట్ చేశాం, జీరో కార్బన్ బిల్లు తెచ్చాం, హైవే ను సేఫ్ గా మార్చాం, జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించాం. ఇలా రెండేళ్లలో చేసిన పనులన్నింటినీ రెండు నిమిషాల 56 సెకన్లలో గుక్క తిప్పుకోకుండా చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి కరోనా మహమ్మారిపై ప్రపంచదేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో కివీస్‌ను కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు.
వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ, వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా మార్చి మరింత పటిష్టమైన ప్రణాలికలు అమలు చేశారు.నెల రోజుల పాటు లాక్ డన్ ప్రకటించిన జసిండా .. ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చేశారు. దీంతోపాటు పిల్లల మేధస్సు పెంచే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చేశారు. ఫలితంగా కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ నుండి తరిమికొట్టడంలో సక్సెస్ సాధించి ప్రపంచమంతా తనపేరు జపించేలా చేశారు జసిండా.