భారత్‌తో FTA..న్యూజిలాండ్ గ్రీన్ సిగ్నల్!

1
- Advertisement -

భారత్, న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక కీలక మైలురాయి నమోదైంది. భారత్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ( FTA) న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం (సెప్టెంబర్ 16) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి.

ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత న్యూజిలాండ్ నుండి భారత్‌కు ఎగుమతి అయ్యే దాదాపు 95 శాతం వస్తువులపై సుంకాలు (Tariffs) పూర్తిగా రద్దు కావడం లేదా గణనీయంగా తగ్గడం జరుగుతుంది. అలాగే ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే న్యూజిలాండ్‌కు చెందిన 57 శాతం ఎగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవు. మరోవైపు భారత్ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు పన్ను రహిత ప్రవేశం (Duty-Free Access) లభించనుంది. దీనితో పాటు వచ్చే 15 ఏళ్లలో భారతదేశంలో 20 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది.

ఈ చారిత్రాత్మక బిల్లు పార్లమెంట్‌లో నెగ్గడంపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధ్యం కాదని చాలామంది అన్నారు. కానీ మా ప్రభుత్వం తమ మొదటి విడత పాలనలోనే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసి మాట నిలబెట్టుకుంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్లోకి మన ఉత్పత్తులకు తలుపులు తెరుచుకోవడం ద్వారా న్యూజిలాండ్‌లో కొత్త ఉద్యోగాలు, రాబడులు పెరుగుతాయి అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

Also Read:కాంగ్రెస్ పథకాలు..ట్రంప్ కాపీ!

న్యూజిలాండ్ వాణిజ్య శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే మాట్లాడుతూ…రెండు దేశాల వ్యాపారులకు ఈ ఒప్పందం తక్షణమే భారీ ప్రయోజనాలను అందిస్తుంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్విపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ, ప్రధాని లక్సన్‌ల లక్ష్యానికి ఇది ఊతమిస్తుంది అని వివరించారు.రెండు దేశాలు తమ చట్టబద్ధమైన ఆమోద ప్రక్రియలను ముగించిన వెంటనే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా అమల్లోకి రానుంది.

- Advertisement -