మూడు వన్డేల తర్వాత జూలు విధిల్చింది న్యూజిలాండ్. వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటు నాలుగో వన్డేలో భారత్‌ను చిత్తుచేసింది. పేస్ బౌలింగ్ దాడిని కొనసాగిస్తు భారత టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చింది. భారత్ విధించిన 93 పరుగుల విజయలక్ష్యాన్ని 14.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది.
హెన్రీ నికోలస్ (30),రాస్ టేలర్ (37) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌ను గెలిచి పరువు దక్కించుకోవాలన్నకసితో మైదానంలోకి దిగిన కివీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు.
ట్రెంట్ బౌల్ట్ చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. బౌల్ట్ ఐదు వికెట్లు, గ్రాండ్‌హోమ్ మూడు, టోడ్ ఆస్టిల్, నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లను ఎదుర్కుంటూ చాహల్ 18 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య(16), శిఖర్ ధావన్(13), కుల్‌దీప్ యాదవ్(12) తప్ప మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును చేయలేదు.