ఐటీ ఉద్యోగులకు సరికొత్త టెన్షన్!

8
- Advertisement -

ఐటీ మరియు కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్స్ భయం మళ్లీ తీవ్రంగా వెంటాడుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన సీనియర్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై మార్కెట్‌లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల ఒరాకిల్, అడిడాస్ వంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీల్లో చోటుచేసుకున్న ఉద్యోగాల కోతలతో 40 లేదా 45 ఏళ్లను లేఆఫ్స్‌కు నిర్ణీత వయసుగా కంపెనీలు చూస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒరాకిల్ సంస్థ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను 1.62 లక్షల నుండి 1.41 లక్షలకు తగ్గించింది. ఈ లేఆఫ్స్‌లో అత్యధికంగా 40 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారని నివేదికలు తెలుపుతున్నాయి. మరోవైపు అడిడాస్ టెక్నాలజీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ గురుగ్రామ్ టెక్ హబ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులతో సహా దాదాపు 50 శాతం ఉద్యోగులను ప్రభావితం చేసింది.

నిజానికి ఏ కంపెనీ కూడా 45 ఏళ్లను నిష్క్రమణ వయసుగా అధికారికంగా నిర్ణయించలేదు. కానీ ఒక ఉద్యోగికి 15-20 ఏళ్ల అనుభవం వచ్చేసరికి వారి జీతాలు ఎక్కువగా ఉండటం, మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించాలనుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సీనియర్లే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వోక్స్‌వాగన్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్, మెటా, యాక్సెంచర్ వంటి దిగ్గజాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం ఈ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.

ఒకప్పుడు ఒకే కంపెనీలో 15 ఏళ్లు పనిచేస్తే దాన్ని ‘ఉద్యోగ భద్రత’గా భావించేవారు. కానీ మారుతున్న టెక్ ప్రపంచంలో దానికి అర్థం పూర్తిగా మారింది. ఇప్పుడు ‘మీ నైపుణ్యాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండే నిజమైన ఉద్యోగ భద్రత’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగులు చేయాల్సిందేమిటి?

అప్‌స్కిల్లింగ్ : ఏటా వస్తున్న కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించాలి.

Also Read:గణేశుడి లడ్డూ@రూ. కోటి

టెక్నికల్ + మేనేజ్‌మెంట్ స్కిల్స్: కేవలం మేనేజ్‌మెంట్‌కే పరిమితం కాకుండా టెక్నికల్ పరిజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవాలి.

ఏఐ ఫ్రెండ్లీగా మారడం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి పని ఉత్పాదకతను పెంచుకోవాలి.

ఈ లేఆఫ్స్‌ను వయసు మీద పడిన వారిపై జరుగుతున్న దాడిగా కాకుండా, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాల స్వరూపంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పుగా గ్రహించి ముందుకు సాగడమే ఏకైక పరిష్కారం.

- Advertisement -