జనవరిలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో దానికి అనుగుణంగా జిల్లాల వారీ కార్డుల సమాచారం క్రోడీకరించే పని ప్రస్తుతం జరుగుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల రేషన్‌కార్డుల ముద్రణ పూర్తయింది. కార్డులు ఆయా జిల్లాల కలెక్టరేట్లకు కూడా చేరాయి. ఈలోగా కొత్త జిల్లాలు రావటంతో కార్డుల సమాచారంలో ఆయా జిల్లాలు, మండలాల పేర్లను మార్చాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు తాజా కోడ్‌లను కేటాయించింది. ఆ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులు మండలాల కోడ్‌లను రూపొందించే పనిని దాదాపు పూర్తి చేశారు.
ఏయే జిల్లాకు ఎన్ని కార్డులు వస్తున్నాయనే డాటాను విభజించాల్సి పని కొంత మిగిలి ఉంది. మరోవైపు ఇంకా ముద్రణ జరగని జిల్లాల్లో కార్డుల పనిని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త ఏడాది జనవరిలో వీటిని జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ముద్రితమై ఉన్న కార్డులు వృథా కాకుండా వాటిపై జిల్లాల, మండలాల పేర్లతో పాటు కోడ్‌లను పునఃముద్రించి జారీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 86 లక్షల ఆహార భద్రతకార్డులున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 7,11,292 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 46,585 అంత్యోదయ, 6,64,699 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వీటికి ఆంతోదయ కార్డుకు 35 కేజీలు, ఆహార భద్రత కార్డులోని ఒక్కొరికి 6కేజీల చొప్పున ప్రభుత్వం బియ్యం అందిస్తుంది. అంత్యోదయ కార్డులకు 46,585కు గాను 16,304.75 క్వింటాళ్ళు, 6,64,699 ఆహారభద్రత కార్డులకు గాను 19,30,262 మంది సభ్యులకు 19,302.62 క్వింటాళ్ళ చొప్పున మొత్తం 20,56,024 మంది లబ్ధిదారులకు 35,607.37 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2,57,252 ఆహార భద్రత కార్డులు, 17,580 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఇందుకు నెలకు 5,228 మెట్రిక్ టన్నుల బియ్యంను విడుదల చేయనున్నారు. పేదల సంక్షేమ కోసం ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న నిత్యవరస సరుకులను డీలర్లు, వ్యాపారులకు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు.
రేషన్ దుకాణాల్లో అందించే నిత్యవసర సరుకుల ధరలు బయట మార్కెట్ ధరకంటే చాలా తక్కువగా ఉండటంతో బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఆహారభద్రత కార్డులను వినియోగించుకునే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రతి నెలా పక్కదారి పట్టడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు రేషన్‌డీలర్లు నిబంధనలు పాటించకుండా నామమాత్రంగా నాలుగు రోజులు సరుకులు పంపిణీ చేసి మిగతా వాటిని మిల్లర్లు, వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. బియ్యం, కిరోసిన్, పంచదార అక్రమార్గంలో నల్లబజారుకు తరలిపోవటంతో భారీఎత్తున ప్రభుత్వం అందిస్తున్న రాయితీ దుర్వినియోగం అవుతుంది. పౌర సరఫరాల శాఖాధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేపడుతూ అక్రమ రేషన్ సరుకులను పట్టుకుంటున్నా పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఎదో ఒక ప్రాంతంలో పట్టుబడుతూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ విధానం అమల్లోకి తీసుకురానుంది. ఈ-పాస్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలోనే ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. వీలైనంత త్వరగానే ఈ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పౌర సరఫరాల శాఖాధికారి భగవాన్ రెడ్డి తెలిపారు.