2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరు ధండా చరిత్ర సృష్టించింది. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
ఫైనల్ రౌండ్లో నీరు ధండా 28 స్కోరు సాధించి నూతన ఆసియా రికార్డును నెలకొల్పింది. ఈ పోటీలో చైనాకు చెందిన యునాంగ్ సున్ (26) రజతం సాధించగా, కువైట్కు చెందిన హజర్ అబ్దుల్ మాలిక్ (21) కాంస్య పతకం గెలుచుకున్నారు.
ఈ విజయంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్కు ఐదో స్వర్ణ పతకం లభించింది.మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో నీరు ధండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కూడిన భారత బృందం మొత్తం 328 పాయింట్లు సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా 346 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, కువైట్ 325 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది.
వ్యక్తిగత విభాగం క్వాలిఫైయింగ్ రౌండ్లో నీరు ధండా 118 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, ఆమె సహచరులు ఆషిమా అహ్లావత్ (106), మనీషా కీర్ (104) ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు.
జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 29 నాటికి భారత్ మొత్తం 47 పతకాలను (5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలు) సాధించింది.సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు 54 వేదికలలో జరుగుతున్న ఈ నాలుగేళ్లకోసారి నిర్వహించే క్రీడా వేడుకలో 43 క్రీడాంశాలలో మొత్తం 469 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి.
Also Read:సిరిసిల్ల క్రికెటర్ అక్షరకు కేటీఆర్ అండ

