అసని…భారీ వర్షాలు..రైళ్లు రద్దు

55
asani toofan
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అసనీ తీరాన్ని తాకింది. మధ్యాహ్నం లోపల కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలపగా అసని ప్రభావం ఏపీలోని కాకినాడ,విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీ వెళ్లే 37 రైళ్లను రద్దుచేసింది.

అసాని తుపాను ఇవాళ తీరం దాటనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.

తీరం దాటే సమయంలో గంటకు 75 నుంచి 95 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరించారు. ఇక అసానిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా…అవసరమైతే అదనపు బలగాలు కూడా సిధ్దంగా ఉన్నాయని చెప్పారు. తుపాను పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను అజయ్ భల్లా ఆదేశించారు. తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి.

- Advertisement -