ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బిహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మహాకూటమి ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఎన్డీయే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా బీజేపీ సత్తా చాటుతూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే విజయం సాధిస్తే సీఎం ఎవరవుతారనే చర్చ మొదలైంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, బీజేపీ కంటే జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
అయితే బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గీయ ఈ మధ్యాహ్నం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక అంశాలపై సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో, సొంత వ్యక్తినే బీజేపీ సీఎంగా ఎంపిక చేయబోతోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
బీహార్ ఫలితాలు:
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 126 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి 106 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది.