బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు దర్యాప్తును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న విచారించింది. తాజాగా శనివారం కూడా దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, కరిష్మా ప్రకాశ్‌ల వాంగ్మూలాలను ఎన్‌సీబీ నమోదు చేసిందని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముతా అశోక్ జైన్ తెలిపారు.
అదేవిధంగా ధర్మ ప్రొడక్షన్స్‌కు చెందిన క్షితిజ్ ప్రసాద్‌ను పలు కోణాల్లో ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశామని అశోక్ జైన్ చెప్పారు. తాజా అరెస్ట్‌తో కలిపి ఈ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరిందని ఆయన వెల్లడించారు. అయితే శనివారం కొత్తగా ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు.
దీపికాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పలు కోణాల్లో వివిధ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. దీపికా మేనేజర్ కరిష్మాతో జరిగిన చాటింగ్ పై దీపికను ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు దీపికా డ్రగ్స్ తీసుకుందా అనే కోణంలో కూడా విచారించారు. మరికొన్ని ప్రశ్నలకు దీపిక మౌనంగా వహించడంతో ఈ కేసులో ఎన్సీబీ మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.