నట సింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో గతంలో ప్రారంభించి, ఆగిపోయిన ‘నర్తనశాల’ చిత్రానికి చెందిన దాదాపు 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈనెల 24న ఈ సన్నివేశాలను శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్‌లో విడుదల చేయబోతున్నారు. కాగా తాజాగా నర్తనశాల ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఈ అజ్ఞాతవాసం విజయవంతంగా ముగియవలెనన్న నాపైనే ఎక్కువ బారమున్నది’ అంటూ బాలకృష్ణ చెబుతున్న సంభాషణలతో మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ద్రౌపది పాత్రలో సౌందర్య నటన నర్తనశాలకు హైలెట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీహరి, శరత్‌బాబు, ఇతర నటీనటులు తమ పాత్రల్లో లీనమై పోయి నటించారు. నర్తనశాలలో బాలకృష్ణ కీచకుడు, అర్జునుడిగా రెండు పాత్రల్లో నటించగా..సౌందర్య ద్రౌపది పాత్రలో నటించింది. ఇప్పటికే బాలకృష్ణ, సౌందర్య ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, సౌందర్య, శ్రీహరి వంటి దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించబోతున్నామని చెప్పారు. ఈ సినిమాను చిత్రీకరించే సమయంలో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కేవలం 10 రోజులు మాత్రమే డేట్స్ తీసుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే షూటింగ్ చేసేశానని తెలిపారు. కళాకారులకు గౌరవాన్ని ఇవ్వడం, షూటింగ్ సమయంలో అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోవడం వంటివన్నీ నాన్న దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. ఈ చిత్రం వసూలు చేసే మొత్తంలో కొంత భాగాన్ని ఛారిటీస్ కి ఉపయోగించాలని బాలకృష్ణ తెలిపారు.