పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో నవంబర్ 9న భారత వాతావరణ శాఖ సహకారంతో జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్‌పో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ మరియు నాన్ వర్కింగ్ ప్రాజెక్ట్ మోడళ్ల ప్రదర్శన, పోస్టర్ ప్రదర్శన మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ కార్యదర్శి సభ్యులు డాక్టర్ పులి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత మరియు ఇటీవలి ఆధునిక ఆవిష్కరణలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆవిష్కరణలు మరియు పరిశోధనలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అందించే వివిధ సైన్స్ అండ్ టెక్నాలజీ పథకాలను ఆయన సూచించారు. వాతావరణ శాఖ విభాగాధిపతి డాక్టర్ కె. నాగరత్న , వివిధ వాతావరణ సూచన పద్ధతులకు అనుగుణంగా జరిగిన వివిధ నూతన ఆవిష్కరణల గురించి వివరించారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నాగజ్యోతి మాట్లాడుతూ.. సాంకేతిక విద్యతో పాటు సృజనాత్మక ఆలోచనలతో కూడిన ఆవిష్కరణలు నేటి పారిశ్రామిక రంగంలో జరిగే విప్లవాత్మక మార్గాన్ని గూర్చి మరియు సృజనాత్మక ఆలోచనల అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. ఎక్స్‌పో కన్వీనర్ రూపా కుమార్ సభకు స్వాగతం పలికారు. వాలెడక్టరీ సమయంలో నగదు బహుమతులు మరియు ధృవపత్రాలను విజేతలకు అందజేశారు.