ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వరుసగా మూడు పర్యాయాలు దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను నేతలు కొనియాడారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాన సేవక్’గా ఆయన ప్రయాణం సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాన్ని దేశవ్యాప్త కార్యక్రమంగా మార్చిందని పేర్కొన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ స్ఫూర్తితో ఆయన పాలన కొనసాగుతోందని అన్నారు.
మోదీ నాయకత్వంలో దేశంలో మౌలిక వసతులు, డిజిటల్ రంగం, కనెక్టివిటీ, అవకాశాల విస్తరణ వంటి అంశాల్లో మార్పులు కనిపిస్తున్నాయని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ముఖ్యంగా 25 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడటం చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం మోదీకి ఆరోగ్యం, బలం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాసేవ నుంచి జాతీయ సేవ వరకు’ అనే భావనను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్న నాయకుడిగా మోదీని అభివర్ణించారు. దేశ గౌరవం, ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
Also Read:కేటీఆర్ సాయంతో సైక్లింగ్‌లో స్వర్ణం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భాన్ని అద్భుతమైన, అపూర్వమైన, చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. 2001లో గుజరాత్ సీఎంగా ప్రారంభమైన మోదీ ప్రస్థానం.. అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ నిర్మాణం దిశగా కొనసాగుతోందని అన్నారు. మోదీ కష్టపడి పనిచేసే తీరు, సహనం, ఉత్సాహం అందరికీ స్ఫూర్తిదాయకమని చౌహాన్ పేర్కొన్నారు.

