కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి నిరసన చేపట్టారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వారితో పాటు నిరసనలో పాల్గొన్న మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ఎంపీలు మంగళవారం ఢిల్లీలో నిరసన చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వారు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
మార్చ్‌ను అడ్డుకున్న తర్వాత పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆకాషవాణి భవన్ సమీపంలో బైఠాయించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఆకాషవాణి భవన్ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే నిరసన కొనసాగించారు. వారిని బయటకు వెళ్లాలని పోలీసులు కోరినప్పటికీ, ఎన్నికల సంఘం అధికారులను కలిసే అవకాశం కల్పించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.
Also Read:ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌కు స్పందన కరువు..
ఢిల్లీ పోలీసుల ప్రకారం.. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు చేపట్టిన మార్చ్‌కు అధికారికంగా అనుమతి తీసుకోలేదు. అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు కూడా సమర్పించలేదని పోలీసులు పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం 260 మందిని, వారిలో 10 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వివరాలు చెబుతున్నాయి.

