సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు. జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో ప్రేక్షకులు అందరూ కచ్చితంగా నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
చాలామందికి ఇప్పటికీ జాతీయగీతాన్ని ఎలా ఆలపించాలో తెలీడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అలాగే వ్యాపార సంబంధ టీవీ కార్యక్రమాల్లో మాత్రం దీన్ని వినియోగించకూడదని సూచించింది. జాతీయ గీతాన్ని ఎక్కడపడితే అక్కడ ముద్రించకూడదని పేర్కొంది. మరోవైపు సుప్రీం కోర్టు తాజా నిర్ణయంపై కేంద్రం స్పందించింది. రాష్ట్రాలకు వెంటనే ఈ విషయాన్ని తెలియజేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది.
1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్ధానం ఆర్డర్స్ ఇచ్చింది.