‘విశ్వగురు’ను ఎప్పుడూ ప్రశంసించలేదు!

2
- Advertisement -

ముంబయి యూనివర్సిటీ నిర్వహించిన జష్న్-ఏ-ఉర్దూ కార్యక్రమానికి చివరి నిమిషంలో తనను ఆహ్వానం నుంచి తొలగించారని, అనంతరం తానే హాజరుకావడం నిరాకరించాడని తప్పుడు ప్రచారం చేశారని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తన రాజకీయ విమర్శలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ ప్రశంసించని “విశ్వగురు”ని ఈ సందర్భంలో ప్రస్తావించారు.

విద్యార్థులతో మమేకమవడం పట్ల తనకు ఉన్న దీర్ఘకాల ఆసక్తిని గుర్తు చేసుకున్న షా, నాలుగు దశాబ్దాలుగా నటన బోధన, మార్గనిర్దేశంలో తన అనుభవాన్ని వివరించారు. జనవరి 31 అర్ధరాత్రి సమయంలో, మరుసటి రోజు జరగాల్సిన కార్యక్రమానికి తాను రావాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు.తాను దేశాన్ని విమర్శించలేదని, అధికారంలో ఉన్న వారి ప్రవర్తనపైనే తన విమర్శలని స్పష్టం చేశారు. గత దశాబ్దంలో దేశ నాయకత్వం, పెరుగుతున్న అసహనం, అధికార దుర్వినియోగంపై తాను బహిరంగంగా విమర్శలు చేసినట్లు పేర్కొన్నారు.

“నేను ఎప్పుడూ ‘విశ్వగురు’ని ప్రశంసించలేదు. ఆయన ప్రవర్తనపై నాకు అభ్యంతరం ఉంది. ఆయన ఆత్మమోహం నన్ను బాధిస్తుంది. గత 10 ఏళ్లలో ఆయన చేసిన ఒక్క పనికీ నేను మెచ్చుకోలేదు. అధికార వ్యవస్థ చేసే అనేక విషయాలను నేను విమర్శించాను, ఇప్పటికీ చేస్తున్నాను అని షా రాశారు. యూనివర్సిటీ నుంచి ఎలాంటి వివరణ లేదా క్షమాపణ రాలేదని, అంతేకాదు తానే కార్యక్రమానికి రావద్దని నిర్ణయించుకున్నట్లు ప్రేక్షకులకు ప్రకటించడం మరింత అవమానకరమని ఆయన ఆరోపించారు.

Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

తనను ఆహ్వానం నుంచి తొలగించడం వెనుక ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తాను చేసిన విమర్శలే కారణమై ఉండవచ్చని షా అభిప్రాయపడ్డారు.

- Advertisement -