బుధవారం లోక్‌సభలో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ముందు మహిళా విపక్ష ఎంపీలు బ్యానర్లు పట్టుకుని ఆయన సీటు వైపు దూసుకెళ్లడంతో సభా కార్యకలాపాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో లోక్‌సభను వాయిదా వేశారు.
దీనికి మరుసటి రోజు గురువారం రాజ్యసభలో కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానాలపై ఘాటు వాగ్వాదం జరిగింది. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు అనుమతించడంలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి దేశ ప్రయోజనాలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ. లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడనివ్వకపోతే సభను ఎలా నడుపుతారు? అని ఆయన ప్రశ్నించారు.
దీనికి నడ్డా తీవ్రంగా స్పందిస్తూ లోక్‌సభలో జరిగిన ప్రక్రియలను రాజ్యసభలో చర్చించరాదు. ఇది పార్లమెంటరీ సంప్రదాయం అని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ప్రతిపక్షమే సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని నడ్డా వ్యాఖ్యానించారు.
Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని
ఈ వాగ్వాదం మరింత తీవ్రమవడంతో ఖర్గే బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం ఎవ్వరినీ లించ్ చేయదు, దూషించదు. మాట్లాడనివ్వకుండా ప్రజలను అణిచివేస్తున్నారు అని అన్నారు. ‘లించ్’ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. చివరకు ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేయడంతో ఈ ఘర్షణ ముగిసింది.

