ఆంద్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేరు దేశ ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలనలో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ కేంద్రమంత్రి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టుతో ముగియనుంది. 2012లో రెండోసారి ఉపరాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
గవర్నర్ నరసింహన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ నరసింహన్ పట్ల సదబిప్రాయం కలిగి ఉన్నారని, ప్రత్యేకంగా సర్జికల్ దాడుల సమయంలో నరసింహన్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా ఉపయోగపడ్డాయని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదాల పరిష్కారంలో కూడా నరసింహన్ చొరవ చూపుతున్నారని ,అది కూడా నచ్చిందని, అందువల్ల ఆయన పేరు ఉప రాష్ట్రపతి పదవికి పరిశీలనకు రావచ్చని అంటున్నారు. ఇక ఈ ఏడాది మే నెలలో నరసింహన్ పదవీకాలం ముగియనుంది.
రాష్ట్రపతి పదవికి ఉత్తరాది నేతను, అందునా ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంబంధం ఉన్న వ్యక్తికి ఎంపిక చేయాలనుకుటున్ననేపథ్యంలో రాజకీయేతరుడిని ఉపరాష్ట్ర పతికి ఎంపిక చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.
యుపిఏ ప్రభుత్వంలో నియమితుడయిన నరసింహన్ ని 2014 తర్వాత కూడా బిజెపి కొనసాగించాలనుకోవడం, మూడేళ్లుగా రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగించేందుకు అంగీకరించడంతో ఆయన మీద బిజెపి నాయకత్వానికి ఏ మాత్రం వ్యతిరేకత లేదని అర్థమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు గవర్నర్ కు విపరీతమయిన ప్రాముఖ్యం ఇస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంతగా చంద్రుల్లిద్దరు రాజ్ భవన్ సందర్శిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజ్ భవన్ ప్రాముఖ్యం పెరిగింది. అన్నిఅనుకూలిస్తే నరసింహన్ రాజ్ భవన్ నుంచి నేరుగా కొత్త ఢిల్లీ నెంబర్ 6 , మౌలానా అజాద్ రోడ్ కు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
1946లో జన్మించిన నరసింహన్ మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. 1968లో భారత పోలీసుశాఖలో చేరారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేశారు. తర్వాత ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జనవరి 22, 2010న పూర్తి స్థాయిలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.