తెలుగుదేశం పార్టీ (TDP) తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తూ, ఆయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (Executive President) నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నానికి చెందిన ఆయన గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పార్టీ క్యాడర్‌లో ఆయనకున్న పట్టును గుర్తించిన నాయకత్వం మరోసారి ఆయనకే బాధ్యతలు అప్పగించింది.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిటీలను టీడీపీ ప్రకటించింది.పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిటిబ్యూరోలో సీనియర్ నాయకులకు పెద్దపీట వేశారు.జాతీయ స్థాయిలో పార్టీ విధానాలను అమలు చేసేందుకు నూతన సభ్యులను ఎంపిక చేశారు. జిల్లాల వారీగా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కమిటీలను భర్తీ చేశారు.
గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్, పార్టీ నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడంతో, భవిష్యత్తులో పార్టీ పూర్తి స్థాయి పగ్గాల దిశగా ఇది కీలక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు, పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటి అంశాలపై లోకేశ్ ఇకపై నేరుగా దృష్టి సారించనున్నారు.
ALso Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

