వరుసగా ఏడో ఏడాది ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు మంత్రి నారా లోకేష్. తమ ఆస్తలు వివరాలు మార్కెట్ విలువ ప్రకారం మారుతుంటాయని..తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా తేడాలు లేవని తెలిపారు. చంద్రబాబు పేరిట రూ3.58 కోట్ల అప్పులు ఉన్నాయని..నికర ఆస్తులు రూ2.53 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ రూ. 30 లక్షలు పెరిగిందని చెప్పారు.
తమ కుటుంబానికి ప్రధాన ఆదాయవనరు హెరిటెజ్ అని చెప్పుకొచ్చారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని…ఇప్పుడు అది రూ.2600 కోట్ల టర్నోవర్‌కు పెరిగిందన్నారు.తన తల్లి భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.25.41 కోట్లుగా ఉందని నారా లోకేష్ చెప్పారు. తన పేరిట రూ.15 కోట్ల 25 లక్షల ఆస్తులున్నాయని తెలిపారు. తమపై ఆరోపణలు చేసేవారు ఆస్తులు ప్రకటించాలని లోకేష్ సవాల్ చేశారు.
తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.15.01 కోట్లు కాగా దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లని తెలిపారు. దేవాన్ష్ ఆస్తుల్లో పెద్దగా మార్పు లేదని ప్రకటించారు. అయితే చంద్రబాబు కంటే దేవాన్ష్ ఆస్తుల విలువే ఎక్కువ కావడం విశేషం.