నాణ్యత లేని మధ్యాహ్న భోజనం..లోకేష్ ఫైర్

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని దేవునిచెరువు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటన వెలుగులోకి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.

విద్యార్థులకు ఉత్తమ సంరక్షణతో పాటు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత తక్కువగా ఉందని సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీని మార్చడంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం సహించదని ఆయన హెచ్చరించారు.

Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -