నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతూ గ్రీట్ చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రోజులు గడిచే కొద్దీ వయసు పెరుగుతుందంటారు కానీ నా వయసు మాత్రం తగ్గుతోందనిపిస్తోందని అన్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న బాలయ్య కేక్ కట్ చేశారు. పుట్టడం,చనిపోవడం మానవ సహజమని కానీ బతికి ఉన్నన్నాళ్లు చేసే మంచి పనుల వల్ల జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటామన్నారు.
బసవ తారకం ఆసుపత్రి ద్వారా సేవలు, సినిమాల్లో నటన, ఎమ్మెల్యేగా ప్రజా సేవలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. క్యాన్సర్‌పై పోరాడాలన్న నాన్న కలను సాధించేందుకు మాజీ సీఎం చంద్రబాబు రూపం ఇచ్చారని గుర్తుచేశారు.