నల్లగొండ పోలీస్ స్టేషన్లను హరిత వనాలుగా తీర్చిద్ధిద్దడం లక్ధ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి అందరు పోలీస్ అధికారులు మొక్కలు నాటే విధంగా కృషి చేస్తున్నామని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన ఎస్పీ రంగనాధ్ నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మూడు రకాల పండ్ల మొక్కలను నాటడం జరిగింది. అనంతరం నల్లగొండ ట్రాఫిక్ సిఐ అనిల్, చండూర్ సిఐ సురేష్ కుమార్, విమెన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ గౌడ్ లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. వారు మొక్కలు నాటడంతో పాటు మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కలపెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సేద తీరడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. భావి తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. మొక్కల నాటడం, వాటిని సంరక్షించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని అప్పుడే గ్రీన్ ఛాలెంజ్ లక్ష్యం దిశగా అడుగులు పడతాయని అన్నారు. పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది చేత మొక్కలు నాటించడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేసి వారిని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యులు చేయాలన్నారు.
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ నేతృత్వంలో నిర్వహించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో నల్లగొండ టూ టౌన్ సిఐ మహబూబ్ బాషా, చండూర్ సిఐ సురేష్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ గౌడ్, ఎస్.ఐ.లు నర్సింహులు, యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.